Thursday, May 21, 2015

ఆనందమా నువ్వెక్కడా?

పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం.

పాతికేళ్ళొచ్చాక సంపాదనలో ఉందనుకుంటాం.

నలభైలలో ఉద్యోగంలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం.

యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం.అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం.

 ప్చ్.. ఎక్కడా కనిపించదు.ఆనందమా నువ్వెక్కడున్నావు? 





' అబ్బో ఎంత డబ్బు! అంతా మనదేనా? ' 
' మనది కాదు,నాది.నా డబ్బు.నేను కష్టపడి సంపాదించిన డబ్బు '. 
'అంత క..ష్ట..ప..డి ఎందుకు సంపాది్చినట్టో ' 
' ఆనందంగా బతకడానికి ' 

***********************************

' ఎన్నో పెగ్గు సోదరా.. ' 
' ఫో..ర్! స్సార్రీ.. స్సార్రీ. ఫైవ్ ' 
' తెలియకడుగుతాను.తాగితే ఏమొస్తుందీ ' 
' హ్యాప్పీగా ఉంటుందీ బాస్... ' 

**********************************

' ఎన్నికల్లో పోటీ చేసినట్లున్నారు? హ్యాపీగా ఉందా? ' 
' ఫర్లేదు. కానీ, గెలిచి మంత్రి పదవొస్తే... ' 
' మంత్రి కావాలని ఎందుకంత ఆరాటం ' 
' పదవొస్తే పవరొస్తుంది.పవర్లో ఆనందముంది ' 

***********************************


      ఆనందం ఎక్కడుంది? మద్యంలోనా,డబ్బులోనా,భోజనంలోనా.శృంగారంలోనా, ఆ రాజకీయ నాయకుడు చెప్పినట్టు పదవిలోనా? ఈ ఒక్క ప్రశ్నకీ జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కర్లేదు. ఇంతకీ ఆనందాన్ని వెతికిపట్టుకోవడం ఎలా? 

పేపర్లో ' కనిపించుట లేదు ' అని ప్రకటన ఇస్తే సరిపోతుందా? పోలిస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడ పెట్టాలా? భూతద్దంల్లోంచి చూస్తే కనపడుతుందా? మైక్రోస్కోప్ వాడాలా? మజ్జిగలో వెన్నలాగా    పాలలో మీగడలాగా.. నక్కినక్కి దాక్కుని ఉంటుందా? నేరుగా కళ్ళకే కనిపిస్తుందా? ఘనమా, ద్రవమా? ఆడా,మగా? ఆనందమా...నీ ఉనికేది,నీ  అడ్రసెక్కడ, నీ కథేమిటి, నీ వెనకెవరున్నారు?


మీలోనే ఉంది... 

మీకు మద్యం ఆనందాన్నిస్తుంది . డబ్బు ఆనందాన్నిస్తుంది . ఉద్యోగం ఆనందాన్నిస్తుంది. ప్రమోషన్ ఆనందాన్నిస్తుంది.అంటే, అవేవో దర్జాగా వచ్చి మీకిస్తాయి.మీరు పుచ్చుకుంటారు. అంతేనా? అశగా చేతులు చాచేవాళ్ళెప్పుడూ యాచకులే.అంటే, మీరు కూడ యాచకులే.ఆనంద యాచకులు! ఆ దారిద్ర్యం మీకొద్దు.మీరె దాతగా మారండి.ఆనందాన్ని మీ దోసిళ్లకొద్దీ పంచండి.ఆనందంగా ఉన్న వ్యక్తి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.పరిసరాల్లోని మనుషులు,ప్ర్రకృతి, పశుపక్ష్యాదులు....అంతా ఆనందమయమే! కస్తూరి మృగం సువాసనల వెంట పరుగులు తీసినట్టు,మీరు కూడ ఆనందం ఆనందమంటూ ఎక్కడెక్కడికో పరిగెత్తకండి.ఆనందం మీ దగ్గరే ఉంది. మీలోనే ఉంది.
   మీకు లేనిదాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు.ఉన్న శక్తి సామర్థ్యాన్ని ఎలా సద్వీనియోగం చేసుకోవాలో చూడండి.జీవితం తక్కెడ లాంటిది.కొన్నిసార్లు అటు మొగ్గుతుంది.కొన్నిసార్లు ఇటు మొగ్గుతుంది.అది సహజం.కానీ మన వైపు మొగ్గితే ఆనందిస్త్తాం.ఇంకోవైపు మొగ్గితే బాధపడిపోతాం.అదే మంచిది కాదు.దేన్నయినా సమానంగా తీసుకోవాలి. 


ఆ దారి మీకు తెలుసు ...


   ఇంతకి ఆనందం ఎక్కడుందో తెలుసా? కారులో,బంగళాలో,బ్యాంకు బ్యాలెన్సులో అని మాత్రం చెప్పకండి.ఈ ప్రాపంచిక విషయాల్లో ఆనందాన్ని వెతికిన కొద్దీ విషాదం ఎక్కువవుతుంది.నిజమైన ఆనందం అంతరాల్లోంచి వస్తుంది.ఆనందానికి మూలం అంతరంగమే.ముందు దాన్ని శుభ్రం చేసుకోండి.నిష్కల్మషంగా ఉంచుకోండి.ప్రేమతో నింపుకోండి.అప్పుడు, వెతుక్కోవాల్సిన బాధ ఉండదు.ఆనందం దానంతట అదే ఉబికి వస్తుంది. 

    గాదెలో ఉన్న గింజ ' నేను చాల గొప్పదాన్ని. ఆ మట్టితో స్నేహం చేయడమేమిటి, ఆ బురదలో కలిసిపోవడమేమిటి? ' అన్న అహంభావంతో ఉంటుంది.అందుకే, ఏదో ఒకరోజు అది ఏ ఎలుకకో పందికొక్కుకో ఆహారమైపోతుంది.అదే, మట్టితో స్నేహం చేసి ఉంటే ఎంత బావుండేది.చక్కగా మొలకెత్తేది,మొక్కగా మారేది..పచ్చని పంటై నలుగురికీ అన్నం పెట్టేది.ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకునేది! 

   గాదెలోని గింజలా ఆలోచించడం కష్టాలకు హేతువు.మొలకెత్తిన విత్తులా ఆలోచించడం ఆనందానికి హేతువు.మీరె నిర్ణయించుకోండి,ఎలా ఉండాలనుకుంటున్నారో? 


మన జన్మహక్కు


డబ్బు...సెక్స్...అహంభావం... 
చాల సమస్యలకు ఇవే కారణం.నేను డబ్బు వద్దనడం లేదు.శృంగారానికి దూరంగా ఉండమనడంలేదు.అహంభావాన్ని వదులుకొమ్మనీ చెప్పడం లేదు. డబ్బు పర్సులోనే ఉండాలి.శృంగారం శరీరానికే పరిమితం కావాలి.ఏది మీ మనసుదాక రాకూడదు.దేని స్థానం దానిదే.వంటింట్లో ఉండాల్సిన పదార్థాలు వంటింట్లోనే ఉండాలి.పూజగదిలో ఉండాల్సిన సామాగ్రి పూజగదిలో ఉండాలి.బాత్ రూములో ఉండాల్సినవి అక్కడే ఉండాలి.ఓ చోట ఉండాల్సింది  ఇంకోచోట చేరితేనే సమస్య. అర్థమైందనుకుంటా? 

' బాబూ! ఇంత కష్టపడి చదువుతున్నవే నీ లక్ష్యం ఏమిటీ? ' 
' మంచి ఉద్యోగం సంపాదించడం ' 
' ఆ తర్వాత.. ' 
' నచ్చిన అమ్మాయినీ పెళ్లిచేసుకోవడం... ' 
' శుభం. అదయ్యాక... ' 
' పిల్లలు,వాళ్ళ చదువులు,సంపాదన... ' 
' ఆ పైన.. ' 
' ఇంకేముంది రిటైరైపోయి,ఆనందంగా బతకడం! ' 

ఆనందాన్ని అన్నేళ్ళు వాయిదా వేసుకోవాలా? హాయిగా బతకడానికి అంతదాక ఆగాలా? అవసరం లేదు.ఆనందం కష్టానికి ప్రతిఫలం కాదు.ఎదురు చూపులకు ప్రతిఫలం కాదు.అది మీ హక్కు.మీ జన్మహక్కు.ప్రతీ క్షణం ఆనందంగా జీవించండి.ప్రతి పనిలో ఆనందించండి.ప్రతీ మలుపులో ఆనందించండి. 

సమస్యంతా ఎక్కడొచ్చిందంటే... 
బయటి ప్రపంచంలో జరిగే ప్రతీ పరిణామంతో ఆనందానికి ముడిపెట్టుకుంటాం.చినుకులు పడితే ఆనందం.వరదలొస్తే విషాదం.ప్రమోషనొస్తే ఆనందం. పింక్ స్లిప్ ఇస్తే విషాదం.ప్రేమిస్తే ఆనందం. ద్వేషిస్తే విషాదం.ఆనందం మనసుకు సంబందించిన విషయం.దాన్ని మనసుకే పరిమితం చేయండి.బయటి విషయాలతో ముడిపెట్టకండి. 

మనసులో ఒత్తిడి ఎక్కవైనా,చికాగ్గా అనిపించినా,నిద్రపట్టక పోయినా డాక్టరు దగ్గరికి వెళ్తాం.ఏవో మందులిస్తాడు వేసుకుంటాం.దాన్లోని రసాయనాలు మన మీద ప్రభావం చూపిస్తాయి.మీరు ఆనందంగా ఉన్నపుడు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన రసాయనాలన్ని మీ ఒంట్లోనే ఊరుకొస్తాయి.డాక్టర్లతో పనిలేదు.మందులతో పనిలేదు. 


      కన్యాకుమారిలో సూర్యాస్తమయ దృశ్యాన్ని చూడాలని ఓ యాత్రికుడి కోరిక.ఇన్నాళ్ళకు తీరింది.బస్సు బయల్దేరింది.అతని ద్యాసంతా తాను చూడబోయే ఆ సుందర దృశ్యం మీదే.పక్కన ఎవరున్నదీ కూడ గమనించలేదు.మరో ప్రయాణికుడూ అక్కడికే బయల్దేరాడు.ఇద్దరూ గమ్యానికి చేరుకున్నారు.కానీ ఆకాశం మబ్బులు పట్టడంతో... సూర్యాస్తమయం కనిపించలేదు.మొదటి ప్రయాణికుడు నిస్పృహకు గురయ్యాడు.తన దురదృష్టానికి తెగ బాధపడిపోయాడు.రెండో ప్రయానికుడు కెఎడ కొంచెం నిరుత్సాహపడ్డాడు.అంతే, అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తేడాకి కారణం ఏమిటో తెలుసా... 
మొదటి ప్రయాణికుడు కన్యాకుమారినే తలచుకుంటూ,ప్ర్రయణాన్నీ ఆస్వాదించలేకపోయాడు.రెండో ప్రయాణికుడు మాత్ర్రం, అడుగడుగునా యాత్రానుభూతిని జుర్రుకున్నాడు.కొండల్నీ. కోనల్నీ, జలపాతాల్ని, జనసంద్రాన్నీ.... హాయిగా ఆస్వాదించాడు. 


జీవితంలో గమ్యం ముఖ్యమే. కానీ, ప్రయాణాన్నీ అనుభూతించాలి. 
చిటపట చినుకులు కూడితే సముద్రం అయినట్టు...చిన్నచిన్న అనుభూతులు కలిస్తేనే ఆనందం అవుతుంది! 


No comments:

Post a Comment