ఏడాది రాస్తే ఆమరణ నేస్తం...
కొత్తొక వింత అయితే కావొచ్చు గానీ పాతొక రోత మాత్రం కాదు.. కనీసం డైరీ విషయంలో.కొన్ని బంధాలూ భావనలూ పాతబడేకొద్దీ చిక్కనవుతాయి.డైరీలూ అంతే.రోజులు గడిచినకొద్దీ పేజీలు కొత్త అందం సంతరించుకుంటాయి.క్యాలెండర్లు మారినకొద్దీ నూతన వికాసం కలిగిస్తుంటాయి.
డైరీ ...మనం గీసుకునే చిత్రం,చెక్కుకునే శిల్పం,చూసుకునే అద్దం, ఒక్కమాటలో .. అది మన మనో నేత్రం. మనలో ఎదుగుతుంది.మనలో భాగమవుతుంది.బహుశా అంతిమక్షణాలదాక అంటిపెట్టుకునీ ఉండే ఆత్మీయ నేస్తం ఇదొక్కటే..
వేసుకునే దుస్తులూ మెప్పుకోసం..
పెట్టుకునే నగలు గొప్పకోసం..
కట్టుకునే ఇల్లు హోదాకు చిహ్నం..
చేసుకునే శుభకార్యం మన అంతస్తుకు అద్దం..
ఇన్నిటిలో,మనకోసం... పూర్తిగా మనకోసమే చేసుకునే పని డైరీ రాయడం.మనల్నీ మనం అర్థం చేసుకోవడం కోసం,ఆచ్చాదన లేకుండా ఆవిష్కరించుకోవడం కోసం జరిపే సత్యాన్వేషణ..దినచర్య రాయడం.
ఓం ప్రథమంలో ..
ఏదైన కావ్యం ఆరంభించినపుడు కృత్యాద్యవస్థకు లోనవుతారు కవులు. అంటే,మొట్టమొదట ఏం రాయాలి..ఏ పదం,ఏ వాక్యంతో ఎత్తుకోవాలి..అని మధనపడతారు. ఎవరికైనా ప్రారంభం చాల గొప్పగా ఉండాలనిపిస్తుంది కదా! డైరీకి కూడ ఇలాంటి అవస్థ తప్పదు.తెల్లనిక్ పేజి మీద పెన్ను ఓ పట్టాన ముందుకు కదలదు.అలాంటపుడు ఒక స్పూర్థిమంతమైన కొటేషన్ తో మొదలుపెట్టొచ్చు.తొలిరోజు ఆ తొలివాక్యం 'మమ ' అనిపిస్తే, తర్వాత ఎన్ని పేజిలైన ఖరారు చేసుకోవచ్చు.
తిట్టుకున్నదీ, కొట్టుకున్నదీ , అలిగిందీ, సొలిగిందీ కోపాలు - తాపాలూ, చూసిన సినిమా, చదివిన పుస్తకం, కలిసిన పాత మిత్రులూ,పెనవేసుకున్న కొత్త స్నేహాలూ, అమ్మ నాన్న అక్క తమ్ముడూ బాబాయ్ పిన్నీ అత్తా మామా బావా బావమరిదీ...ఏమైన రాయొచ్చు,ఎవరినైన పాత్రలుగా మలచుకోవచ్చు.వాక్యాల్లో తప్పుందని అడిగేవారు లేరు. వ్యాకరణం పాటించాలని నియమం లేదు.మనది మనకు అర్థమైతే చాలు.మనకోసం మనం రాసుకుంటే చాలు.
వద్దు సంశయం, కూడదు బద్ధకం ..
ప్రియురాలి అందెల సవ్వడుల మీద ఆటవెలదులు, కురుల హోయల మీద కందపద్యాలు..
విరహగీతాలూ వేడి నిట్టుర్పులూ..
అచ్చుకాని కవిత్వాలూ అడ్డుకట్ట వేయలేని కోరికలూ...
నిద్రను పాడుచేసే కలలూ నిద్రపోకుండా సాధించాలనుకుంటున్న కలలూ..
లోకబాధను తన బాధగా మలచుకున్న అపర శ్రీ శ్రీలా సంసారీ సంధ్యా సమస్యలూ ..
తనబాధను లోకబాధగా చేసిన కృష్ణశాస్త్రీ శిశ్యుడిలా ' సంధ్య ' తొ వచ్చిన సమస్యలూ ..
డైరీలో ఏమైనా రాసుకోవచ్చు.ఏం రాసిన భద్రంగా దాచుకుంటుంది.
విద్యార్థి, ఉద్యోగార్థి,సంసారి, బ్రహ్మచారి అన్న తేడా లేదు.ఎవరు రాసుకున్నా భాష మెరుగుపడుతుంది,వ్యక్తీకరణ బాగవుతుంది.మనకు మనం అర్థమవుతుంటాం. మనలో ఉన్న రచయిత, విమర్శకుడు,విశ్లేషకుడు,తాత్వికుడు అందరూ కట్టగట్టుకుని బయటకు వస్తారు.మనకే తెలియని కొత్త కోణాలు చూపెడతారు.మనల్నీ మనకే కొత్తగా పరిచయం చేస్తారు.
ఉండకూడనిదెల్లా సంశయం.వదిలించుకోవాల్సింది బద్ధకం. ' ఒకసారి డైరీ రాయడం ప్రారంభిస్తే - ఏది రాయాలో ఎలా రాయాలో మనకే తెలుస్తుంది.ఇక్కడ పాటించాల్సిన నియమం ఒక్కటే.డైరీలోని ప్రతీ అక్షరం మన నిజాయితీకి నిలువుటద్దం కావాలి.లేకపోతే డైరీ ఒక చెల్లని నాణెంలా మిగిలిపోతుంది ' అంటారు గాంధీజీ.

కాలచక్రం
కాలం మారింది.కాగితం అక్కర్లేదంటోంది.కాగితం మీదే రాయాలని నియమం లేనివాళ్ళు ఆన్ లైన్లో విశేషాలను పొందుపరుస్తున్నారు. అయినా స్వదస్తూరి,స్వదస్తూరే.రాసుకున్నదానికే శాశ్వతత్వం ఎక్కువ.అప్పటీ మూడ్, మురిపెం అక్షరాల్లో ప్రతిఫలిస్తాయి.గడిచిపోయిన రోజులను చూసేందుకు ' కాలచక్రం ' వెనక్కి తిప్పేంత శ్రమ అక్కర్లేదు.డైరీ పుటలు తిప్పితే చాలు.

No comments:
Post a Comment